India - America
India - Us trade deal | అమెరికాపై ప్ర‌తీకార సుంకాలు.. డ‌బ్ల్యూటీవోకు స‌మాచార‌మిచ్చిన ఇండియా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India – America | సుంకాల పేరిట ప్ర‌పంచ దేశాల‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికాకు ఇండియా(India) షాక్ ఇచ్చింది. భార‌త్ నుంచి దిగుమ‌త‌య్యే వాహ‌నాలు, ఆటోమొబైల్ ప‌రిక‌రాల‌పై 25శాతం టాక్స్ విధించిన అగ్ర‌రాజ్యంపై ప్ర‌తీకార సుంకాలు విధించేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (డ‌బ్ల్యూటీవో)కు స‌మాచార‌మిచ్చింది. త‌మ దేశ ఉత్ప‌త్తుల‌పై సుంకాలు విధించినందుకు ప్ర‌తీకార చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు త‌మ‌కు హ‌క్కు ఉంటుందని ఇండియా స్ప‌ష్టం చేసింది. ఇండియా ఎగుమ‌తి చేసే ప్యాసెంజ‌ర్ వాహ‌నాలు, తేలికపాటి ట్ర‌క్కులు, ఆటోమొబైల్ ప‌రికారాల‌పై అమెరికా(America) గ‌త మార్చిలో టారిఫ్‌లు పెంచింది. 25 శాతం సుంకాలు విధించాల‌ని నిర్ణ‌యించ‌గా, గ‌త నెల నుంచి అవి అమ‌లులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ తాజాగా ప్ర‌తీకార సుంకాల‌కు ప్ర‌తిపాదించింది. ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్య ఒప్పందం(India – Us trade deal) ఖ‌రార‌య్యే నేప‌థ్యంలో సుంకాల పెంపు నిర్ణ‌యం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

India – Us trade deal | అమెరికా చ‌ర్య‌ల‌కు ప్ర‌తీకారం..

భారతదేశం నుంచి వచ్చే నిర్దిష్ట ఆటోమొబైల్స్ ఉత్ప‌త్తులు, విడిభాగాలపై అమెరికా సుంకాలను పెంచింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశంపై దాదాపు 724 మిలియన్ డాల‌ర్ల ప్రతీకార సుంకాలను విధించాలనే తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి స‌మాచార‌మిచ్చింది. ప్రయాణికుల వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, ఇత‌ర ఆటోమొబైల్ భాగాలపై అమెరికా మార్చి 26, 2025న 25% యాడ్ వాలోరెమ్ సుంకాల పెరుగుదలను విధించింది. అయితే, ఈ నిర్ణ‌యం డ‌బ్ల్యూటీవో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని భార‌త్ పేర్కొంది. సుంకాల పెంపు ప్ర‌తిపాద‌నను ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌కు స‌మాచార‌మివ్వ‌లేద‌ని తెలిపింది. అమెరికా నిర్ణ‌యంజ‌న‌ర‌ల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ (గాట్‌) 1994ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో గాట్ ఆర్టికల్ 12.3 ప్ర‌కారం.. అలాగే ఆర్టికల్ 8 కింద రాయితీలు లేదా ఇతర బాధ్యతలను నిలిపివేయడానికి భారతదేశం హక్కును కలిగి ఉందని పేర్కొంది. ఈ మేర‌కు ఇండియా డ‌బ్ల్యూటీవోకు స‌మాచార‌మిచ్చింది. దీనిపై స్పందించిన ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌(World Trade Organization).. ప్ర‌తీకార సుంకాలు విధించేందుకు భార‌త్‌కు హ‌క్కు ఉంద‌ని నోటిఫికేష‌న్ జారీ చేసింది.

India – Us trade deal | 723 మిలియ‌న్ డాలర్ల భారం..

అమెరికా చర్యల కార‌ణంగా భార‌త్ ఆటోమొబైల్ సంస్థ‌ల‌పై 723 మిలియ‌న్ డాలర్ల భారం ప‌డ‌నుంది. భారతదేశం నుంచి ఏటా 2,895 మిలియన్ డార్ల విలువైన ఆటోమొబైల్ ఉత్ప‌త్తులు(Automobile products) అమెరికాకు ఎగుమ‌తి అవుతాయి. వాటిపై అగ్ర‌రాజ్యం 25 శాతా టారిఫ్‌లు పెంచ‌డంతో మ‌న దేశీయ సంస్థ‌ల‌కు 723 మిలియ‌న్ డాలర్ల న‌ష్టం వాటిల్లుతోంది. దీంతో భార‌త్ అంతే మొత్తంలో అమెరికాపై సుంకాలు విధించేందుకు సిద్ధ‌మైంది.