అక్షరటుడే, వెబ్డెస్క్ : F&O investors | ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (Future and Option)పై రిటైల్ ఇన్వెస్టర్లలో (retail investors) మోజు తగ్గడం లేదు. భారీగా నష్టపోతున్నా.. లాభాలపై ఆశతో జూదమాడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సెబీ(SEBI).. కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ (F&O trading) చేస్తున్న వారిలో 90 శాతానికిపైగా నష్టపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లే (Retail investors) ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మదుపరుల సంపదను కాపాడేందుకు సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నష్ట భయం ఎక్కువగా ఉండే ఈ ట్రేడింగ్(Trading)కు రిటైల్ ఇన్వెస్టర్లను దూరంగా ఉంచేందుకోసం గతేడాది నవంబర్‌లో పలు చర్యలు చేపట్టింది. అయినా కూడా చిన్న మదుపరులు పెద్దగా వెనక్కి తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.
ఆ నేపథ్యంలో డిసెంబరు నుంచి మార్చి వరకు మూడేళ్ల కాలంలో నమోదైన గణాంకాలను సెబీ పరిశీలించింది. గతేడాది డిసెంబర్‌నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈక్విటీ డెరివేటివ్స్ (Equity derivatives)లో ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య గతేడాది ఇదే కాలంతో పోల్చితే 12 శాతం తగ్గినా.. రెండేళ్ల క్రితం అంటే 2022 డిసెంబరు-2023 మార్చితో పోలిస్తే 77 శాతం పెరిగినట్లు గుర్తించింది. ఇదే సమయంలో ప్రీమియం (Premium) పరంగా చూస్తే ఇండెక్స్ ఆప్షన్లలో వ్యక్తిగత మదుపరుల ట్రేడింగ్ పరిమాణం 5 శాతం తగ్గింది.
నోషనల్ లావాదేవీలూ (notional transactions) 16 శాతం తగ్గాయి. కాగా రెండేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ప్రీమియం లావాదేవీలు 34 శాతం, నోషనల్ లావాదేవీల పరిమాణం 99 శాతం పెరగడం గమనార్హం. కఠిన చర్యలు తీసుకుంటున్నా రిటైల్ ఇన్వెస్టర్లలో (retail investors) ఎఫ్‌అండ్‌వోపై మోజు తగ్గకపోవడంతో మరిన్ని చర్యలు తీసుకునేందుకు సెబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మదుపరుల పెట్టుబడులకు రక్షణ కల్పించడం, మార్కెట్లలో స్థిరత్వం(Market stability) కల్పించాలన్న లక్ష్యాలతో ఈ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.