అక్షరటుడే, కామారెడ్డి : Rajampet | వరదలతో ఆగమైన ఆ తండావాసులకు అండగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శి (GP Secretery) అటువైపు వెళ్లడం మానేశారు. తాగునీరు లేక అల్లాడుతున్నామని ఫోన్ చేస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో (Heavy Rains) వరద పలు గ్రామాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజంపేట మండలం ఎల్లపూర్ తండా (Yellapur Thanda) సైతం వరదల్లో మునిగింది. గుండారం, మెదక్ రహదారి తెగిపోయింది. దీంతో పాటు తండాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తండాను వరద ముంచెత్తడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లపైకి ఎక్కి తలదాచుకున్నారు.
Rajampet | ఆడియో వైరల్
వరద బాధితులకు అండగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శి వారిని చులకనగా చూసింది. తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు చెబితే నోటికి వచ్చినట్లు మాట్లాడింది. వాటర్ ట్యాంకర్ (Water Tanker) తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుంటామని.. డీజిల్‌కు డబ్బులు కావాలని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు.. ఎక్కడి నుంచి తేవాలంటూ ప్రశ్నించింది. నీళ్లు లేకపోతే ……….. తాగమనండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.
Rajampet | రెస్ట్ తీసుకో..
భారీ వరదలో తండాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజులుగా కరెంట్ లేకపోవడంతో బోర్లు పని చేయడం లేదు. తాగునీరు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. అయినా సంబంధిత జీపీ కార్యదర్శి అటువైపు వెళ్లడం లేదు. దీంతో కారోబార్ సోమవారం పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి తండా సమస్యలపై వివరించారు. తాగునీటి కోసం ట్యాంకర్ తీసుకు వెళ్తానని డీజిల్ డబ్బులు కావాలని కోరాడు. ‘డీజిల్‌కు నా దగ్గర పైసలు లేవు. ఎక్కడి నుంచి తీసుకురావాలి.. ఐదు రోజుల నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్న.. నువ్వు కూడా రెస్ట్ తీసుకో’ అంటూ ఆమె కారోబార్కు ఉచిత సలహా ఇచ్చింది.
తండా ప్రజలకు నీళ్లు ఎట్లా అని కారోబార్‌ను అడిగితే.. నీళ్లు లేకపోతే ……. తాగమనండి అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ సమస్యలపై కార్యదర్శికి బాధ్యత లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సమస్యలపై అడిగితే ఆమె ప్రతిసారి ఇలాగే మాట్లాడుతుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.