అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reserve Bank | భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) తిప్పికొట్టింది. ఇండియన్ ఎకానమీ చాలా బలంగా ఉందని బుధవారం స్పష్టం చేసింది. అలాగే ప్రపంచ వృద్ధికి అమెరికా కంటే ఎక్కువగా దోహదం చేస్తోందని తేల్చి చెప్పింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా దృఢంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Reserve Bank Governor Sanjay Malhotra) పేర్కొన్నారు. భారతదేశ ఎగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలు పెంపు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నారు. అమెరికా విధించిన సుంకాలపై ప్రతీకార టారిఫ్ విధించడం ఇరుదేశాల మధ్య తీవ్రతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటుందని ఆయన గుర్తు చేశారు.
Reserve Bank | ప్రపంచ వృద్ధికి బాసటగా భారత్..
రష్యా నుంచి తక్కువ ధరకు భారీగా చమురు కొనుగోలు చేస్తున్న ఇండియాపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి భారత్ నిధులు సమకూర్చుతోందని ఆయన ఆరోపించారు. అందుకు గాను 25 శాతం టారిఫ్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఇండియా, రష్యాలవి మృత ఆర్థిక వ్యవస్థలని వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలను కొట్టిపడేశారు. “ప్రపంచ వృద్ధికి భారత్ దాదాపు 18% తోడ్పాటునిస్తుంది. ఇది అమెరికా కంటే ఎక్కువ, అక్కడ సహకారం దాదాపు 11% మాత్రమే. ఇండియన్ ఎకానమీ చాలా బలంగా ఉంది. రానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుందని’ మల్హోత్రా అన్నారు.
Reserve Bank | వృద్ధి బాటలో ఇండియా..
కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ అతివేగంగా వృద్ధి చెందుతోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Monetary Fund) 2025లో ప్రపంచ వృద్ధి 3% అంచనా వేయగా, భారతదేశం 6.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసిందని గుర్తు చేశారు. కానీ అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదవుతుందని మల్హోత్రా తెలిపారు. గతంలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి రేటు నమోదైందన్నారు. అమెరికాతో (America) కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీకార సుంకాలు విధించకపోతే భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల (US Tariffs) ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నామన్నారు, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. “ప్రపంచ వ్యాప్తంగా అనేక వాణిజ్య సవాళ్లు అలాగే ఉన్నాయి, కానీ మారుతున్న ప్రపంచ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ అనేక అవకాశాలను కలిగి ఉంది. వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మేము నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని” చెప్పారు.