అక్షరటుడే, కామారెడ్డి : BC JAC | బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కామారెడ్డి బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం (Municipal Office) వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్ విగ్రహాల వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservations) సాధన కోసం గురువారం మౌనదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీల హక్కులను నెరవేర్చాలన్నారు. తమిళనాడు తరహాలో 50 శాతం సీలింగ్ ఎత్తేసి బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. త్వరలోనే వెయ్యి మందితో కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా బీసీల చైతన్యం కోసం యాత్ర చేపడతామని తెలిపారు. అన్ని సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని నిరంతరం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు (JAC Leaders) సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, పండ్ల రాజు, కన్నయ్య, పున్న రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, మల్లన్న, రాజేందర్, ఇర్ఫాన్, లలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
