అక్షరటుడే, ఇందూరు: Teenmar Mallanna | బీసీలకు రిజర్వేషన్ల పేరుతో (BC Reservations) కాంగ్రెస్ నాటకమాడుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) అన్నారు. మాధవ నగర్ శివారులోని హోటల్ కృష్ణాలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల ఐక్యత చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
రాష్ట్రంలోని బీసీలంతా ఒక్కటయ్యారని.. 2029లో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మల్లన్న జోస్యం చెప్పారు. బీసీలకు మించిన రాజకీయ శక్తి ఏదీ లేదని, తన వెనక ఉంది బీసీ ప్రజలేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పూర్తిగా నాటకమేనని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం కాదని 60 శాతం ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్సీ కవితతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఆమె బీసీ కాదని, బీసీ నినాదంతో కవితకు సంబంధం లేదని ఆరోపించారు.
జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు జనరల్‌లో ఉంటే కాంగ్రెస్ ఓసీలకు మాత్రమే సీట్లు కేటాయించిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. జిల్లాలో 25 లక్షల మంది బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం శోచనీయమన్నారు. కామారెడ్డిలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ (Gampa Govardhan) సీటును కూడా కేసీఆర్ (KCR) లాక్కున్నాడని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓడినా.. గెలిచినా ఏడుసార్లు అవకాశం ఇచ్చిందని, అక్కడ ఓసీ జనాభా ఎంత ఉందని ప్రశ్నించారు.
బీసీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు (BajiReddy Govardhan) ప్రతిసారి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం మారుస్తూ అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డ బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి (Kishan reddy) ఎందుకు చేయలేదని అన్నారు.
2009లో ధర్మపురి శ్రీనివాస్ (DS) ఎమ్మెల్యేగా గెలిస్తే బీసీ అయినా డీఎస్ ముఖ్యమంత్రి అయ్యేవాడు స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కో–ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ హరి శంకర్ గౌడ్, సమన్వయకర్త జానయ్య యాదవ్, సూర్యారావు, నరయ్య గౌడ్, ఓదేలు యాదవ్, బుస్సాపూర్ శంకర్, రమేష్ యాదవ్, రమేష్ పటేల్, నరేందర్, సతీష్ గౌడ్, చంద్రశేఖర్, జ్యోతి, రేఖ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.