అక్షరటుడే, వెబ్డెస్క్ : Imran Khan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలులో హత్య చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఆయన అభిమానులు, పీటీఐ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) మునీర్ అత్యవసర భేటీ నిర్వహించారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. అయితే ఆయన హత్యకు గురైనట్లు వస్తున్న పుకార్లు మంగళవారం రాత్రి పాకిస్థాన్ అంతటా తీవ్ర ఆగ్రహాన్ని, గందరగోళాన్ని రేకెత్తించాయి. సైనికాధికారి అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం జైలులోనే ఖాన్ హత్యకు ఆదేశించిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరిట ఓ ఖాతా సైతం ‘ఖాన్ కస్టడీలో చంపబడ్డాడు, అతని మృతదేహాన్ని తొలగించారని’ పేర్కొంది. కొన్ని అఫ్గానిస్థాన్ (Afganistan) మీడియా సంస్థలు సైతం పేరులేని మూలాలను ఉటంకిస్తూ పుకార్లను విస్తరించాయి. దీంతో ఆ దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇమ్రాన్ మృతిపై పాక్ ప్రభుత్వం, జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Imran Khan | ఖాన్ కుటుంబ సభ్యులపై దాడి
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు పుకార్లు రావడంతో ఆయన సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం రాత్రి జైలు వద్దకు చేరుకున్నారు. తమ సోదరుడిని చూపించాలని కోరారు. వారితో పాటు పీటీఐ (PTI) కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు వచ్చారు. అయితే శాంతియుతంగా గుమిగూడిన తమపై పోలీసులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఖాన్ పరిస్థితిని అధికారులు దాచిపెట్టారని ఆరోపిస్తూ PTI కార్యకర్తలు అర్ధరాత్రి ప్రదర్శన నిర్వహించారు. మూడు వారాలకు పైగా ఆయనను కలవడానికి కుటుంబ సభ్యులకు అనుమతి లేదని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
Imran Khan | ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ
పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మునీర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పీటీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుండటంతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బతికి ఉంటే ప్రభుత్వం ఎందుకు బయటకు చూపించడం లేదని పీటీఐ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బలూచిస్థాన్ వేర్పాటువాదులు, అఫ్గానిస్థాన్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పాక్లో ప్రస్తుతం అంతర్గత ఘర్షణలు సైతం చెలరేగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ సమావేశం అయినట్లు తెలుస్తోంది.