అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Renuka Chowdhury Privilege Notice | రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 23లోగా వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది.
ఎంపీ రేణుకా చౌదరి (MP Renuka Chowdhury) శీతాకాల సమావేశాల్లో కుక్కను కారులో పార్లమెంటుకు తీసుకొచ్చారు. కుక్కను తీసుకురావడంపై పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. లోపల కూర్చున్నవారే కరుస్తారని, కుక్కలు కరవవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీలను ఉద్దేశించి కరుస్తారని అనడంతో ఆమెపై బీజేపీ (BJP) ఎంపీలు బ్రిజ్‌లాల్, ఇందు బాలగోస్వామి ఫిర్యాదు చేశారు. కుక్కను తీసుకురావడమే కాక.. ఎంపీలను అవమానించేలా మాట్లాడారంటూ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
పార్లమెంటు ఆవరణలోకి వీధి కుక్కను తీసుకురావడం ద్వారా భద్రతా ప్రోటోకాల్స్‌ను ఎంపీ రేణుకా చౌరది ఉల్లంఘించారని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్ (Parliament) సభ్యుల హుందాతనాన్ని కాపాడేందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును ఛైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. గత వారం జరిగిన సమావేశంలో కమిటీ ఈ ఫిర్యాదును పరిశీలించింది. రాతపూర్వక వివరణ ఇవ్వాలని రేణుకా చౌదరిని ఆదేశించింది. ఈ నోటీసుపై రేణుకా చౌదరి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సమాధానం ఇస్తామని తెలిపింది.