అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై గతంలో విధించిన ఆంక్షలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సివిల్ కేసు విషయంలో క్రిమినల్ సమన్లను సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆయన పదవీ విరమణ చేసే వరకూ క్రిమినల్ కేసు(Criminal Case)లు విచారించకుండా ఆగస్టు 4న నిషేధం విధిస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court | సీజేఐ విజ్ఞప్తి మేరకు..
అయితే, ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ జస్టిస్ కుమార్.. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(Justice BR Gavai)ను కోరారు. ఈ మేరకు ధర్మాసనానికి లేఖ రాశారు. ఈ ఉత్తర్వును పునఃపరిశీలించాలని సీజేఐ కోరడంతో కోర్టు తన తీర్పును పక్కన పెట్టింది. “మా మునుపటి ఉత్తర్వులో జారీ చేసిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ సీజేఐ నుంచి తేదీ లేని లేఖ మాకు అందింది” అని ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీజేఐ బీఆర్.గవాయ్ అభ్యర్థన మేరకు క్రిమినల్ కేసులను విచారించకుండా హైకోర్టు న్యాయమూర్తిపై నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టు తమ మునుపటి ఉత్తర్వులో జస్టిస్ ప్రశాంత్ కుమార్(Justice Prashant Kumar) పై చేసిన వ్యాఖ్యలను తొలగించి, “ఈ విషయాన్ని ఇంతటితో మూసివేస్తున్నాము” అని శుక్రవారం ప్రకటించింది. ఈ విషయాన్ని తాజా విచారణ కోసం తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నానమని పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిపాలనా అధికారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం సుప్రీంకోర్టుకు లేదని, ప్రధాన న్యాయమూర్తి రోస్టర్(Chief Justice Roster)కు యజమాని అని అంగీకరిస్తూ ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపించారు, తదుపరి చర్యను ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భన్సాలీ(Chief Justice Arun Bhansali)కి వదిలిపెట్టారు. ఈ కేసులో జస్టిస్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వును “చెత్త, అత్యంత తప్పు” అని అభివర్ణించిన జస్టిస్ పార్దివాలా బెంచ్, న్యాయమూర్తికి ఇబ్బంది కలిగించడం లేదా కులపరమైన అపోహలు కలిగించాలని తాము ఎప్పుడూ ఉద్దేశించలేదని స్పష్టం చేసింది.
Supreme Court | కోర్టుల విశ్వసనీయతను కాపాడడమే మా పని..
న్యాయస్థానాల విశ్వసనీయతను కాపాడడానికి తాము గతంలో ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే దృక్పథంతోనే తాము ఆయా వ్యాఖ్యలు చేశం తప్పితే, న్యాయమూర్తిని కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. న్యాయ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బ తీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించజాలమని తెలిపింది. జస్టిస్ కుమార్‌ను క్రిమినల్ కేసులను విచారించకుండా ఆగస్టు 4న వెలువరించిన ఉత్తర్వు నుంచి సంబంధిత పేరాలను తొలగించామని, సీనియర్ సహోద్యోగితో పాటు డివిజన్ బెంచ్‌లో కూర్చోవాలని న్యాయమూర్తిని ఆదేశించామని సుప్రీంకోర్టు తెలిపింది. “భవిష్యత్తులో హైకోర్టు ఇచ్చిన ఇలాంటి వికృత ఆదేశాలను మనం ఎదుర్కోవాల్సి రాకపోవచ్చునని మేము ఆశిస్తున్నాం. కోర్టులోనే చట్టపాలనను కొనసాగించకపోతే, అది మొత్తం న్యాయ వ్యవస్థకు ముగింపు అవుతుంది. న్యాయమూర్తులు సమర్థవంతంగా పని చేయాలని, తమ విధులను శ్రద్ధగా నిర్వర్తించాలని ప్రజలు భావిస్తున్నారని” ధర్మాసనం వ్యాఖ్యానించింది.