అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాలకు పాల్పడిన భూములను స్వాధీనం చేసుకుంటుంది. చెరువులు, నాలాలతో పాటు పార్క్‌లు, ప్రజావసరాలకు కేటాయించిన భూములను కబ్జా చెర నుంచి విడిపిస్తోంది.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ గ్రామం హస్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కు కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలాన్ని లే అవుట్‌లో చూపించి తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
Hydraa | గంగారాం కాలనీలో.
శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్‌నగర్ పేరిట 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు లే అవుట్ వేశారు. ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారు. పేదలకు ఉద్దేశించిన లే అవుట్‌లో కొందరు పెద్ద పెద్ద వ్యక్తులు పాగా వేశారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చారు. ఇలా ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
ఆక్రమణలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజావాణి (Hydraa Prajavani)కి విశేష స్పందన వస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు వెంటనే స్పందిస్తుండటం, ఆక్రమణలు ఉంటే తొలగిస్తుండటంతో ప్రజలు భారీగా తరలి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో నగరంలో ఆక్రమణలకు పాల్పడిన వారు ఆందోళన చెందుతున్నారు.

