అక్షరటుడే, ఇందూరు: Electricity Department | నగరంలోని విద్యుత్ స్తంభాల నుంచి బ్రాడ్‌బ్యాండ్, డిష్ కేబుళ్లను అధికారులు మంగళవారం తొలగించారు. విద్యుత్ మరమ్మతులు చేపట్టే సమయంలో ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నాగారం సెక్షన్‌లోని ఆర్ఆర్ చౌరస్తా పరిధిలో వీటిని తొలగించారు.
Electricity Department | రామాంతాపూర్‌లో ఘటన జరిగిన నేపథ్యంలో..
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఇటీవల శ్రీకృష్ణుడి రథాన్ని (Lord Krishna Chariot) లాగుతుండగా.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి చెందారు. రామాంతపూర్ (Ramantapur) ఆరుగురు మృతి చెందిన విషయం మరువక ముందే బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. దీంతో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో ప్రమాదం జరిగినట్లు అక్కడి విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department Officers) తెలిపారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ (TGNPDCL CMD) వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు.
Electricity Department | అప్రమత్తమైన అధికారులు..
ఈ మేరకు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్తంభాలకు అస్తవ్యస్తంగా ఉన్న డిష్ కేబుళ్ల కారణంగా ఇతరులకు ఇబ్బందులు కలగడంతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్ సమస్యలు వస్తే సైతం స్తంభాలను ఎక్కలేని పరిస్థితి తయారైంది. దీంతో మంగళవారం సిబ్బంది నగరంలోని రాజరాజేంద్ర టాకీస్ చౌరస్తాలో విద్యుత్ స్తంభాలకు ఎన్న డిష్ వైర్లను తొలగించారు. ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు తమ కేబుళ్లను క్రమపద్ధతిలో క్లిప్పింగ్, క్లాంపింగ్ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు.