అక్షరటుడే, కామారెడ్డి: RTA Checkposts | అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని పొందుర్తి (Pondurthi), సలాబత్ పూర్ చెక్ పోస్టులను (Salabatpur check posts) అధికారులు తొలగించారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, బోర్డులు తొలగించారు. అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని తరలించారు. జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బారికేడ్లను తొలగించారు. ఇకపై ఆర్టీఏ సేవలు ఆన్లైన్ www.transport.telangana.govin ద్వారా అందించనున్నారు.
RTA Checkposts | ఏసీబీ దాడుల నేపథ్యంలో..
జిల్లాలో ఇటీవల ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ (ACB) దృష్టి సారించింది. ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దాంతో జూన్ 26న సలాబత్పూర్ చెక్ పోస్టుపై ఏసీబీ దాడుల్లో రూ.1.81 లక్షలు సీజ్ చేశారు. జులై 16న పొందుర్తి చెక్ పోస్టుపై చేసిన దాడిలో రూ.52 వేలు అధికారులు సీజ్ చేశారు.
అలాగే ఈనెల 19న సలాబత్ పూర్, పొందుర్తి చెక్ పోస్టులపై ఏకకాలంలో అర్ధరాత్రి తర్వాత అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టగా రెండు చెక్ పోస్టులలో రూ.87వేలు సీజ్ అయ్యాయి. దాంతో ఎన్ని దాడులు చేసినా చెక్ పోస్టులలో అక్రమ వసూళ్లు ఆగవని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు చెక్ పోస్టులను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది.
