HomeతెలంగాణIndiramma Houses | అప్పుడు చేసిన తప్పుకు.. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దూరం

Indiramma Houses | అప్పుడు చేసిన తప్పుకు.. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దూరం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | కొందరు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు 20 ఏళ్ల క్రితం తెలిసో తెలియకో చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)కు దూరం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Houisng Scheme) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లో ఇల్లు కట్టుకుంటే విడతల వారీగా రూ.5 లక్షల సాయం అందనుంది.

ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అయితే అనర్హులకు ఇళ్లు వస్తే జాబితాలో నుంచి తొలగించి సాయం నిలిపివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఒక వేళ ఇల్లు నిర్మాణంలో ఉన్నా రద్దు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో పలువురు నష్టపోతున్నారు.

Indiramma Houses | జైళ్లు కూడా సరిపోవు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఇందిరమ్మ హౌసింగ్​ స్కీం ద్వారా ప్రభుత్వం పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం చేసింది. సిమెంట్​ బస్తాలతో పాటు నగదు అందజేసింది. అయితే ఈ స్కీంలో అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇల్లు కట్టుకోని వారికి కూడా నిధులు మంజూరు చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ (KCR)​ ఈ అవినీతి గురించి మాట్లాడుతూ.. హౌసింగ్​ స్కీంలో అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్​ చేస్తే జైళ్లు కూడా సరిపోవన్నారు. అంటే ఎంత పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో కేసీఆర్​ హౌసింగ్​ సొసైటీని రద్దు చేసి డబుల్​ బెడ్​ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తాజాగా కాంగ్రెస్​ ప్రభుత్వం మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోంది.

Indiramma Houses | శాపంగా మారిన ఆ నిబంధన

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఇందులో సొంత స్థలం ఉండి గుడిసె, షెడ్డులో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు కేటాయించారు. అంతేగాకుండా సదరు వ్యక్తిగత 30 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి సాయం పొంది ఉండొద్దు. ఈ నిబంధన ఇప్పుడు చాలా మందికి శాపంగా మారింది.

గతంలో చాలా మంది ఇల్లు కట్టుకోకున్నా ప్రభుత్వం నుంచి సిమెంట్ బస్తాలు, నగదు తీసుకున్నారు. అందులో చాలా వరకు అధికారులు, ప్రజాప్రతినిధులే నొక్కేశారు. అయితే తాజాగా అలాంటి వారికి ఇళ్లు మంజూరు చేయడం లేదు. పలువురికి మంజూరు చేశాక కూడా రద్దు చేస్తుండటం గమనార్హం.

Indiramma Houses | నిర్మాణం ప్రారంభించాక..

నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారంలో రాజు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ప్రస్తుతం వారు ఉంటున్న షెడ్​ను కూల్చేశారు. అయితే గతంలో రాజు కుటుంబం ఇంటి నిర్మాణం కోసం సిమెంట్​, నగదు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు రద్దు చేశారు. దీంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే చెబితే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూల్చేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మారం లక్ష్మీ- బుచ్చయ్య దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో వారు తమకున్న రేకుల షెడ్డుని కూల్చి బేస్మెంట్ వరకు కొత్త ఇల్లు నిర్మించారు. గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం డబ్బులు, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని చెప్పిన జీపీ కార్యదర్శి ఇప్పుడు బిల్లులు రావని చెప్పారు. దీంతో వారు షాక్​ అయ్యారు. ఇలా చాలా గ్రామాల్లో అధికారులు అనర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. అయితే ముందే చెబితే తాము ఉంటున్న గుడిసె, షెడ్డులను తొలగించుకునే వారం కాదని బాధితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇళ్లు మంజూరైన వారిలో దాదాపు పదిశాతం ఇలాంటి వారు ఉంటారని అధికారులు పేర్కొన్నారు. వారందరిని జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Must Read
Related News