అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. బీఆర్ఎస్ (BRS) హయాంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు తాజాగా కొట్టివేసింది.
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలో ఆయన ప్రమేయం ఉందని కేసు నమోదైంది. కరీంనగర్ (Karimnagar) జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. 2023 ఏప్రిల్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ బీఆర్ఎస్పై దూకుడుగా ఉండటంతో అక్రమ కేసులు పెట్టారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు పలు ఠాణాలకు తిప్పారు. అయితే ఈ కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.
రాజకీయ కక్షలతో ఈ కేసు నమోదు చేశారని కేంద్ర మంత్రి సంజయ్ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు లేవని, దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు కోర్టు కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేటీఆర్ (KTR), గోరటి వెంకన్నపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గోరటి వెంకన్న అప్పుడు కేటీఆర్‌ను సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ఇంటర్వ్యూ చేశారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని, బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందని పోలీసులు కేసు పెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కేసు పెట్టారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో హైకోర్టు కేటీఆర్, గోరటి వెంకన్నపై కేసును కొట్టివేసింది.
Bandi Sanjay | సత్యమేవ జయతే
తనపై కేసును కోర్టు కొట్టివేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సత్యమేవ జయతే అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అప్పటి BRS ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కల్పిత పదో తరగతి పేపర్ లీక్ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. BJP నోరు మూయించడానికి బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై కేసు నమోదు చేసిందన్నారు. తనకు దానితో సంబంధం లేదని వారికి తెలుసని, అయినప్పటికీ పోలీసులను ఆయుధంగా చేసుకుని కేసు పెట్టారని పేర్కొన్నారు.
