అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court | సంక్రాంతికి విడుదల కానున్న రాజాసాబ్ (Raja Saab), మన శంకర వరప్రసాద్ (Shankar Varaprasad) సినిమాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన వినతులపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా 11న విడుదల కానుంది. పెద్ద సినిమాలు కావడంతో టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరుతున్నాయి. అయితే ఇటీవల అఖండ–2 సినిమా టికెట్ల రేట్లను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
High Court | ఆ సినిమాలకే పరిమితం
సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో రేట్ల పెంపు విషయంలో కోర్టు పరిధిలో ఈ రెండు సినిమాలకు ఇబ్బందులు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
High Court | మాట మీద నిలబడతారా..
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో రాష్ట్రంలో మూవీ టికెట్ల రేట్లు పెంచమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇటీవల పలు సినిమా టికెట్ రేట్లను (Movie Ticket Prices) పెంచడానిక అనుమతించింది. అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపునకు ఓకే చెప్పగా.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ జీవోను కొట్టి వేసింది. దీంతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచమని స్పష్టం చేశారు. నిర్మాతలు, సిని ప్రముఖులు టికెట్ ధరలు పెంచాలని తమ దగ్గరకు రావొద్దని కోరారు. తమది ప్రజా ప్రభుత్వం, సామాన్యులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాల విషయంలో ప్రభుత్వం మాట మీద నిలబడుతుందా.. లేదా చూడాలి.