అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.
స్థానిక ఎన్నికల్లో(Local Body Elections) బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. దీనిసై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దావే వాదనలు వినిపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విచారణకు హాజరయ్యారు.
BC Reservations | సుప్రీంకోర్టు ఆగ్రహం
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. కాగా ఇదే అంశంపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి కానుంది.