అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. గ్రూప్–1 పరీక్షలపై (Group 1 Exams) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి న్యాయస్థానం తిరస్కరించింది.
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంలో కూడా ఇటీవల ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. హైకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం పిటిషనర్లకు సూచించింది. తాజాగా గ్రూప్–1పై సైతం హైకోర్టు విచారణలో పెండింగ్లో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్–1 నియామకాలపై హైకోర్టు (Telangana High Court) తీర్పును వేముల అనుష్ అనే వ్యక్తి సుప్రీంలో సవాలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
Supreme Court | హైకోర్టు మధ్యంతర తీర్పు
గ్రూప్–1 ఫలితాలు, ర్యాంకులను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీనిపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేసింది. దీంతో ద్విసభ్య ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తమ తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసింది.
Supreme Court | హైకోర్టు ఏం చెబుతుందో..
వేముల అనూష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ ముందు ఈ నెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. గతంలో సైతం పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం పిటిషన్లను కొట్టి వేసింది. అయితే గ్రూప్–1 నియామకాలపై హైకోర్టు ఏం చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ న్యాయస్థానం పరీక్ష రద్దు చేయాలని చెబితే ఇప్పుడు ఇచ్చిన నియామకాలు మొత్తం రద్దు అవుతాయి.