అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు లకు ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్‌పై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు(High Court) ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని సూచించింది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నియామకాన్ని సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు(Harish Rao) మధ్యంతర పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆయా పిటిషన్లను మంగళవారం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసీఆర్(KCR), హరీశ్‌రావు తరఫున సుందరం వాదనలు వినిపించారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కేసీఆర్, హరీశ్‌రావు తరఫున న్యాయవాది తెలిపారు. చట్ట ప్రకారం తమకు 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా తమ వాదన వినకుండా ఏకపక్షంగా నివేదిక ఇచ్చారని చెప్పారు.
High Court | సీబీఐకి అప్పగిస్తున్నామన్న ప్రభుత్వం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ(CBI Invsetigation)కు అప్పగిస్తున్నామని అడ్వకేట్ జనరల్ (ఏజీ), ప్రభుత్వ తరఫు న్యాయవాది (జీపీ) హైకోర్టుకు విన్నవించారు .ఈ మేరకు అసెంబ్లీలో చర్చించాకే సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు వేసిన పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కమిషన్ రిపోర్టుతో సంబంధం లేదని, విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తర్వాత కేసీఆర్, హరీష్‌రావులపై చర్యలు ఉంటాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.