అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | హైకోర్టులో హైడ్రా (Hydraa)కు ఊరట లభించింది. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలను న్యాయస్థానం తప్పు పట్టింది. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గచ్చిబౌలి (Gachibowli)లో మొత్తం 20 ఎకరాల పరిధిలో ఎఫ్‌సీఐ లే అవుట్‌లో వేశారు. ఇందులో 162 ప్లాట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు సంధ్యా కన్వెన్షన్ (Sandhya Convention) యజమాని శ్రీధర్‌రావు కొనుగోలు చేశారు. దీంతో లే అవుట్‌లోని పార్కులు, రోడ్లను ఆయన కబ్జా చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే హైడ్రా చర్యలు చేపట్టింది. ఆక్రమణలను తొలగించింది. అయితే హైడ్రాపై శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. ఒకసారి లే అవుట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
High Court | ఇష్టానుసారంగా నిర్మాణాలు
లే అవుట్‌లోని మిగతా ప్లాట్ల యజమానులు సైతం హైకోర్టులో వాదనలు వినిపించారు. శ్రీధర్ రావు సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. లే అవుట్‌లోని రోడ్లు, తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. దీంతో హైడ్రాకు ఫిర్యాదు చేశామన్నారు. హైడ్రా, బాధితుల వాదనలు విన్న జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. ప్లాట్ల యజమానులకు హైకోర్టు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.
