అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group-2 Exams | గ్రూప్–2 ర్యాంకర్లకు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. 2019 గ్రూప్–2 నియామకాలను ఇటీవల సింగిల్ బెంచ్ ధర్మాసనం రద్దు చేసింది. దీనిపై ర్యాంకులు సాధించి ఉద్యోగాలు చేస్తున్న వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
అభ్యర్థుల పిటిషన్‌పై గురువారం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వచ్చాక తొలిసారి 2015లో గ్రూప్–2 నోటిఫికేషన్ (Group 2 Notification) వెలువడింది. అనంతరం 2016లో అనుబంధ నోటిఫికేషన్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Public Service Commission) వెలువరించింది. అదే ఏడాది నవంబర్‌లో పరీక్షలు జరిగాయి. అనంతరం సుదీర్ఘ కాలం నిరీక్షణ అనంతరం అభ్యర్థులకు 2019లో కొలువులు వచ్చాయి.
Group-2 Exams | 1,032 పోస్టుల భర్తీ
గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) 2015లో నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష నిర్వాహణ, మూల్యాంకనంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2019లో నియామకాలు చేపట్టగా.. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాటు, వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ వంటి అంశాలను సవాల్ చేశారు. దీంతో అలాంటి పేపర్లను మూల్యాంకనం చేయొద్దని గతంలోనే కోర్టు తీర్పు చెప్పింది. అయినా.. వాటిని పరిగణలోకి తీసుకోవడంతో ఇటీవల పరీక్షను రద్దు చేసింది. డబుల్ బబ్లింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. మళ్లీ మూల్యాంకనం చేపట్టి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును తాజాగా ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. దీంతో 2019లో ర్యాంకులు సాధించి ఉద్యోగాలు చేస్తున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.