Homeబిజినెస్​Reliance | రిలయన్స్‌.. అదుర్స్‌.. నికర లాభం 78 శాతం జంప్‌

Reliance | రిలయన్స్‌.. అదుర్స్‌.. నికర లాభం 78 శాతం జంప్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(Reliance Industries) సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. లాభాలు 78 శాతం పెరిగాయి. రిలయన్స్‌ జియో(Jio), రిటైల్‌ వ్యాపారాలలో బలమైన వృద్ధితోపాటు ఏషియన్‌ పెయింట్‌(Asian paint)లో వాటా విక్రయం ఈ భారీ లాభాలకు కారణం.

Reliance : నికర లాభం..

ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.26,994 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసింది. ఇది 2023-24 మొదటి త్రైమాసికంలో రూ. 15,138 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 78.3 శాతం పెరిగింది. ఇది రిలయన్స్‌ చరిత్రలో ఒక త్రైమాసికంలో రికార్డు కావడం గమనార్హం.

గత త్రైమాసికంలో రిలయన్స్‌ రూ.19,407 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంతకుముందు క్వార్టర్‌తో పోల్చితే నికర లాభంలో 39 శాతం వృద్ధి కనిపించింది. రిలయన్స్‌కు చెందిన కన్జ్యూమర్‌ బిజినెస్‌ విభాగాలైన రిటైల్‌, టెలికాం(Telecom) వ్యాపారాలలో బలమైన వృద్ధితో ఈసారి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి.

Reliance : 5.26 శాతం పెరిగిన ఆదాయం..

మొదటి క్వార్టర్‌లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం(Revenue) 5.26 శాతం పెరిగి రూ.2.48 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.2.36 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఓ2సీ(O2C) వ్యాపారంలో ఆదాయం మాత్రం గతేడాదితో పోలిస్తే 1.5 శాతం మేర తగ్గింది.

  • ఈబీఐటీడీఏ(EBITDA) 36 శాతం పెరిగి రూ. 58 వేల కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 42 వేల కోట్లుగా ఉంది.
  • ఈబీఐటీడీఏ మార్జిన్‌ 460 బేసిస్‌ పాయింట్లు(Basis points) పెరిగి 21.2 శాతానికి చేరింది. ఇది గతేడాది 16.6 శాతంగా ఉంది.
  • సంస్థ మొత్తం ఆదాయం ఆరు శాతం పెరిగి రూ.2.73 కోట్లకు చేరింది.

Reliance : విభాగాలవారీగా..

  • రిలయన్స్‌ జియో(Reliance Jio) ఆదాయం 18.8 శాతం, ఈబీఐటీడీఏ 23.9 శాతం పెరిగాయి.
  • రిలయన్స్‌ రిటైల్‌(Reliance Retail) ఆదాయం 11.3 శాతం, ఈబీఐటీడీఏ 12.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
  • ఆయిల్‌ టు కెమికల్స్‌ విభాగం ఆదాయం 1.5 శాతం తగ్గింది. ఈబీఐటీడీఏ మాత్రం 10.8 శాతం పెరిగింది.
  • ఆయిల్‌ టు గ్యాస్‌ ఆదాయం 1.2 శాతం, ఈబీఐటీడీఏ 4.1 శాతం తగ్గాయి.
  • ఏషియన్‌ పెయింట్స్‌లో వాటా విక్రయం ద్వారా సంస్థ రూ. 8,924 కోట్ల లాభం వచ్చింది.

2025-26 ఆర్థిక సంవత్సరాన్ని మెరుగైన ఫలితాలతో ప్రారంభించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) పేర్కొన్నారు. జియో డిజిటల్‌ సేవలు, రిటైల్‌ వ్యాపారం బలమైన వృద్ధిని సాధించాయన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చత పరిస్థితులతో ఎనర్జీ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఓ2సీ వ్యాపారంలో రాణించామన్నారు.

Must Read
Related News