అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Mlc Kavitha | అలీసాగర్ ఎత్తిపోతల (Alisagar lift irrigation project) నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని 48వేలకు పైగా ఎకరాల్లో అలీసాగర్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని గుర్తు చేశారు.
Mlc Kavitha | యాసంగి ప్రారంభమైనా..
యాసంగి సీజన్ ప్రారంభమైనా నీటిని విడుదల చేయకపోవడంతో మూడు నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారని కవిత పేర్కొన్నారు. యాసంగి సీజన్ (Yasangi season) తైబందీ ఖరారు కాలేదనే కారణంతో ఇరిగేషన్ ఇంజినీర్లు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. రైతులు వరి నార్లు పోసుకొని నెల రోజులవుతోందని, తక్షణమే నీటిని విడుదల చేయకుంటే నార్లు ముదిరిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు.
Mlc Kavitha | గోదావరి నదిలో..
గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోతలు ప్రారంభించక పోవడం సరికాదని కవిత అన్నారు. ఒక్క నవీపేట మండలంలోనే 14వేల ఎకరాల్లో అలీసాగర్ కింద యాసంగి పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. యాసంగి వరి నాట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వలస వచ్చారని.. నీటి విడుదలలో జాప్యం కారణంగా రైతులతో పాటు వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలీసాగర్ ఎత్తిపోతలు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.