అక్షరటుడే, వెబ్‌డెస్క్: Youtuber Sunny Yadav | ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో యూట్యూబర్ సన్నీ భయ్యా (Sunny Bhayya) పేరు మార్మోగుతోంది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ అరెస్టు.. ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్(Nutanakal)లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Youtuber Sunny Yadav | సీక్రెట్‌గా విచారణ..
దీంతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా భయ్యా సన్నీ యాదవ్‌పై మార్చి 5వ నూతనకల్ పోలీస్ స్టేషన్(Nutanakal Police Station)లో కేసు నమోదైంది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్(Lookout Circular) కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టు(High Court)లో ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, యూట్యూబర్ సన్నీ యాదవ్ పాకిస్థాన్(Pakistan) లోనే ఉన్నాడు.
అయితే సన్నీ భయ్యాని NIA అధికారులు అదుపులోకి తీసుకుని చెన్నైలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra), సన్నీ యాదవ్(Sunny Yadav) లను కలిపి విచారించినట్లు సమాచారం. పాక్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. యూట్యూబర్ సన్నీ యాదవ్ పర్యటించిన ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి విచారించిన అధికారులు.. కీలక విషయాలు రాబట్టినట్లు వినికిడి. ఇలాంటి తరుణంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు సన్నీ తల్లిదండ్రులు.