అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Judge Yashwant Verma | ఢిల్లీ హైకోర్టు జడ్జి అధికారిక నివాసంలో నగదు దొరికిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి.. రాష్ట్రపతి(President), ప్రధానమంత్రి(Prime Minister)కి నివేదించారని గుర్తు చేసిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం కోరే ముందు అధికారులు చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేసి ఉండాలని సుప్రీం పేర్కొంది. న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపారా నేతృత్వంలోని న్యాయవాదుల బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. “మాండమస్ రిట్ కోరే ముందు, పిటిషనర్ తగిన అధికార వ్యవస్థ ముందు తమ ఫిర్యాదులను పరిష్కరించుకోవాలని కోరాల్సి ఉంటుంది. అందువల్ల, మేం రిట్ పిటిషన్(Writ Petition)ను స్వీకరించడానికి నిరాకరిస్తున్నాం” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Judge Yashwant Varma | భారీగా నోట్ల కట్టలు..
గత మార్చి 14 రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని జస్టిస్ వర్మ(Justice Verma) అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నిమాపక సిబ్బందికి ఓ రూమ్‌లో పెద్ద మొత్తంలో సగం కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. మరోవైపు, స్పందించిన అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna).. అంతర్గత విచారణకు ఆదేశించారు. జస్టిస్ వర్మ దాఖలు చేసిన ప్రతిస్పందనతో పాటు అంతర్గత విచారణ కమిటీ నివేదికను అప్పటి CJI సంజీవ్ ఖన్నా, సిట్టింగ్ జడ్జిలపై దుష్ప్రవర్తన ఆరోపణలు వచ్చినప్పుడు అనుసరించాల్సిన అంతర్గత ప్రక్రియ ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపారని మే 8న సుప్రీంకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ ప్యానెల్ జడ్జి ఇంట్లో నగదు ఉందనే ఆరోపణ నిజమని తేల్చిన తర్వాత, జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని అప్పటి సీజేఐ ఖన్నా కోరారు. కానీ చేయకపోవడంతో న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని CJI రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.
Judge Yashwant Varma | ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్..
జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపారా(Advocate Mathews J Nedumpara) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలను అంతర్గత కమిటీ ప్రాథమికంగా నిజమని తేల్చిందని చెబుతూ, వెంటనే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని పిటిషన్‌లో కోరారు. కోర్టు తీర్పు క్రిమినల్ చట్టం అమలులోకి రావడానికి ఆటంకం కలిగిస్తోందన్న నెడుంపారా 1991 తీర్పును సమీక్షించాలని కోరారు. అయితే, దీనిపై స్పందించిన న్యాయస్థానం.. “రిట్ పిటిషన్ దాఖలు చేసే ముందు, మీరు ప్రాథమిక నియమాన్ని పాటించాలి. అంతర్గత విచారణ నివేదిక, న్యాయమూర్తి ప్రతిస్పందనను భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపినట్లు మే 8 నాటి ప్రెస్ నోట్(Press Note)లో స్పష్టం చేశారు. ఆ నివేదికలోని ఏయే విషయాలు ఉన్నాయో మాకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో మీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత వ్యవస్థలకు మీరు ఫిర్యాదు చేసుకోవచ్చని ” ధర్మాసనం సూచించింది.