అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో (Sanatnagar) గల రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం ఉదయం సంభవించిన ఫ్రిజ్ పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ నివాస గృహంలో ఉన్న రిఫ్రిజిరేటర్ (refrigerator) ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో, మంటలు వ్యాపించి ఇంట్లో భారీగా నష్టం కలిగింది. అయితే, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు.
Hyderabad | ప్రమాదం తప్పింది..
సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో, ఫ్రిజ్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో మంటలు ఇంటి అంతటా వ్యాపించాయి. ఫర్నిచర్ (furniture), ఎలక్ట్రానిక్ (Electronic) వస్తువులు సహా ఇంట్లో ఉన్న ఆస్తి దాదాపుగా మొత్తం అగ్నికి ఆహుతి అయింది. అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు (fire department) సమాచారం అందించగా, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను నియంత్రించారు. విషయం తెలుసుకున్న సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనపై సనత్‌నగర్ పోలీసులు (Sanatnagar police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్రిజ్ పేలుడు గల కారణాలపై ఎలక్ట్రికల్ నిపుణులతో సమీక్షించనున్నట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ (short circuit), గ్యాస్ లీక్, మోటార్ మాల్ఫంక్షన్ వంటి కారణాలు ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో, అధికారులు ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ వంటివి వాటి విషయం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.