అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఎస్పీని రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి (DGP Jitender Reddy) ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం మీడియాకు వివరించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల కారణంగా ఈ ఏడాది మొదటి 7 నెలల కాలంలో, 41 రోడ్డు ప్రమాదాలు, 44 మరణాల తగ్గుదల నమోదైందని ఎస్పీ తెలిపారు. ఇది జిల్లాలో రహదారి భద్రతలో (road safety) శుభసూచకమైన పురోగతి అని పేర్కొన్నారు.
జిల్లాలో 2024 జులై 31 నాటికి 170 రోడ్డు ప్రమాదాలు జరగగా 179 మంది మరణించారని, 315 మందికి గాయలయ్యాయన్నారు. ఈ ఏడాది జులై 31 నాటికి 129 ప్రమాదాలు జరగగా 135 మంది మరణించారని, 272 మంది గాయపడ్డారన్నారు. జిల్లా పోలీసులు (district police) రహదారి భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు.
ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేని ప్రయాణం, హై స్పీడ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా రహదారి భద్రతా (district road safety) చర్యల వల్ల సాధించిన ఈ విశేష ఫలితాలను రాష్ట్ర డీజీపీ అభినందించారన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఆకస్మిక వాహనాల తనిఖీ ద్వారా ఈ నెలలో ఇప్పటివరకు 19 మంది అనుమానాస్పద కదలికలున్న వ్యక్తులను పట్టుకోగా వీరు పాత నేరస్తులుగా గుర్తించి వారి వద్దనుండి నాలుగు బైకులు, గంజాయి, ఒక వ్యక్తి వద్ద నుండి కట్టర్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
631 మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను పట్టుకొని కేసులు చేయగా ఇందులో 9 మందికి 2 రోజుల జైలు శిక్ష రూ. 200 జరిమానా విధించడం జరిగిందన్నారు. వాహన నంబర్ లేకుండా ఉన్న 1740 వాహనాలను గుర్తించడం జరిగిందని, అందులో కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు రహదారి భద్రతా నియమాలను (road safety rules) కచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.