అక్షరటుడే, ఆర్మూర్ : SRSP Inflow | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా వర్షాలు పడటం లేదు. దీనికి తోడు మంజీరపై గల నిజాంసాగర్ (Nizam Sagar) గేట్లు మూసి వేశారు. దీంతో జలాశయానికి వరద తగ్గింది.
ఎస్సారెస్పీకి ప్రస్తుతం ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో 8 వరద గేట్లను ఎత్తి దిగువకు 24,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
SRSP Inflow | వరద కాలువ ద్వారా..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం నిర్మించిన వరద కాలువ (Flood Canal) ద్వారా 20 వేల క్యూసెక్కులు మిడ్ మానేరు (Mid Manair)కు తరలిస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరు నింపితే విద్యుత్ బిల్లుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో వరద కాలువ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మిడ్‌మానేరు నింపుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది.
SRSP Inflow | ఆయకట్టుకు..
ఎస్సారెస్పీ నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు సైతం నీటిని వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 3,500, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500, మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. మొత్తం 54,187 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. ఎగువ నుంచి వదర పెరిగితే గోదావరిలో నీటి విడుదలను పెంచుతామని అధికారులు తెలిపారు. గోదావరిలోకి, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి సూచించారు. కాల్వల, నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.