అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Red Fort Blast Plot | ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) భారీ కుట్ర పన్నింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
పాకిస్థాన్ (Pakistan)కు చెందిన లష్కరే తోయిబా ఢిల్లీ ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖ మత ప్రదేశాలలో పేలుడుకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థ అధునాతన పేలుడు పరికరం (IED) దాడికి కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad)లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా, 160 మందికి పైగా గాయపడిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న కారు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఉగ్రవాద మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్లను అరెస్టు చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉమర్ మొహమ్మద్ అనే మరో ఉగ్రవాది భయాందోళనకు గురై ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడ్డాడు. ప్రస్తుతం మళ్లీ పేలుడుకు ఉగ్రవాదులు (Terrorists) కుట్ర పన్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు బలగాలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.