అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Diwali Business | ఈ ఏడాది దీపావళి దేశ రిటైల్ రంగానికి బంపర్ సీజన్‌గా మారింది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా రూ.6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య రూ. 1.8 లక్షల కోట్లు ఎక్కువ. దీని ఫలితంగా దాదాపు 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. సీఏఐటీ వివరాల ప్రకారం.. మొత్తం అమ్మకాలలో 75 శాతం నాన్-కార్పొరేట్, సంప్రదాయ మార్కెట్ల నుంచే నమోదయ్యాయి. రూ.5.4 లక్షల కోట్లు వస్తువుల విక్రయాల ద్వారా, రూ.65,000 కోట్లు సేవల ద్వారా వచ్చినట్టు పేర్కొంది.
Diwali Business | జీఎస్‌టీ తగ్గింపుతో ఊపు
దేశంలోని రాష్ట్ర రాజధానులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 60 ప్రధాన మార్కెట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను (GST Rates) తగ్గించడం ఈసారి అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణమని 72 శాతం వ్యాపారులు పేర్కొన్నారు. దీని వలన నిత్యావసరాలు, దుస్తులు, పాద రక్షలు, మిఠాయిలు, గృహాలంకరణ సామగ్రి, వినియోగ వస్తువులు బాగా అమ్ముడయ్యాయి. ఈ కొనుగోలు ఉత్సాహం చలి కాలం, పెళ్లిళ్ల సీజన్, అలాగే సంక్రాంతి, ఉగాది , శ్రీరామనవమి (Sri Ram Navami) వరకు కొనసాగుతుందని సీఏఐటీ అంచనా వేసింది. మొత్తం అమ్మకాలలో 28 శాతం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల నుంచే రావడం గమనార్హం.
ఆన్‌లైన్ రిటైల్ రంగం కూడా ఈ దీపావళి సీజన్‌లో (Diwali Season) బలమైన వృద్ధి సాధించింది. యూనికామర్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది దీపావళి అమ్మకాల పరిమాణం 24 శాతం, విలువ పరంగా 23 శాతం పెరిగింది. అదే సమయంలో క్విక్ కామర్స్ ఆర్డర్లు 120 శాతం పెరిగాయి. బ్రాండ్ వెబ్‌సైట్ల అమ్మకాలు కూడా 33 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల ఆన్‌లైన్ ఆర్డర్లను ఆధారంగా తీసుకొని ఈ విశ్లేషణ విడుదలైంది.దీపావళి పండుగ టాటా మోటార్స్ (Tata Motors)కూ భారీ లాభాలను తెచ్చింది. దసరా నుంచి దీపావళి వరకు ఈ కంపెనీ లక్షకు పైగా కార్లను కస్టమర్లకు డెలివరీ ఇచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 33 శాతం అధికం. వాటిలో 38,000 వాహనాలు ఎస్‌యూవీలు కావడం విశేషం.