అక్షరటుడే, హైదరాబాద్: Brain stroke | ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక ఆరోగ్యంపై చూపే శ్రద్ధ, మెదడు (brain) ఆరోగ్యంపై చూపడం లేదు. నాడీ సంబంధిత వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తిస్తే, వ్యక్తి జీవిత కాలం, జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పార్కిన్సన్స్, చిత్తవైకల్యం (డిమెన్షియా), స్ట్రోక్, మూర్ఛ వంటి వ్యాధులు ముదిరే వరకు మనకు తెలియకపోవచ్చు, కానీ మన శరీరం ఇచ్చే కొన్ని సూక్ష్మ సంకేతాలను గమనిస్తే పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు.
Brain stroke | గమనించాల్సిన సంకేతాలు:
వణుకు, కదలికలు: చేతులు వణకడం అనేది కేవలం అలసట అనుకుంటే పొరపాటే. విశ్రాంతి తీసుకునేటప్పుడు చేతులు వణకడం (Shaking hands) పార్కిన్సన్స్ వ్యాధికి తొలి సంకేతం కావచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు ఊపడం తగ్గడం, కదలికలు మందగించడం వంటివి గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
జ్ఞాపకశక్తి, గందరగోళం: వస్తువులను పదే పదే ఎక్కడో పెట్టి మర్చిపోవడం, తెలిసిన వ్యక్తుల పేర్లు గుర్తుకు రాకపోవడం వంటివి కేవలం వయస్సు రీత్యా వచ్చే మార్పులు అని సరిపెట్టుకోకూడదు. ఇవి అల్జీమర్స్ వంటి తీవ్రమైన చిత్త వైకల్యానికి (డిమెన్షియాకి)దారితీసే తొలి అడుగులు కావచ్చు. ప్రారంభంలోనే ఎంఆర్ఐ (MRI) వంటి పరీక్షల ద్వారా మెదడులో వచ్చే మార్పులను గుర్తించవచ్చు.
స్ట్రోక్ హెచ్చరికలు: ముఖం ఒక పక్కకు వాలిపోవడం, మాట తడబడటం, ఆకస్మిక బలహీనత వంటి లక్షణాలు కొద్ది నిమిషాలే ఉన్నా వాటిని ‘మినీ స్ట్రోక్’ గా (mini-strok) భావించాలి. వీటిని సకాలంలో గుర్తిస్తే 80% వరకు మేజర్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు.
మూర్ఛ, చూపులు: మూర్ఛ అంటే కేవలం కింద పడి కొట్టుకోవడమే కాదు. తరచుగా ‘జోనింగ్ అవుట్’ (శూన్యంలోకి చూడటం) లేదా తెలియకుండానే పునరావృత (మళ్లీ మళ్లీ) కదలికలు చేయడం కూడా నాడీ సంబంధిత సమస్యలే.
మెదడు తన పనితీరును కోల్పోకముందే, అది ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలను గుర్తించి అప్రమత్తమవ్వాలి. జీవనశైలి మార్పులు, సరైన వైద్య పరీక్షలు (medical examinations), నిపుణుల సలహాలతో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మెదడు విషయంలో అప్రమత్తతే అసలైన చికిత్స.