అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్టులు (Maoists) సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. కూంబింగ్ ఆపేస్తే తాము ఆయుధ విరమణ తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు.
తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్ట్ పార్టీ (Maoist Party) లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో వెల్లడింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంకు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేసింది.
Maoists | ఆపరేషన్ కగార్తో..
ఆపరేషన్ కగార్తో (Operation Kagar) మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. పక్కా సమాచారం కూంబింగ్ చేపడుతూ.. కీలక నేతలను సైతం ఎన్‌కౌంటర్ చేస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇందులో పార్టీ అగ్రనేత, కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మేలో మృతి చెందారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లలో మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్ శంకర్ చనిపోయారు. ఎన్కౌంటర్లలో కీలక నేతలు, కేడర్ చనిపోతుండడంతో చాలా మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం.
Maoists | జోనల్ కమిటీలకు సమాచారం
కూంబింగ్ ఆపరేషన్ (Coombing Operation) నిలిపివేస్తే ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని తెలిపింది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది. అయితే ఆపరేషన్ కగార్ ఆపడం అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
