అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
తనకు మంత్రి పదవి రాకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి (Minister Post) ఇస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో కేబినెట్లో చోటు కల్పించకపోవడంతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనకు పదవుల కంటే నియోజకవర్గ ప్రజలే ముఖ్యమన్నారు.
Rajagopal Reddy | పదవి వద్దు.. పైసలు వద్దు
భువనగిరి (Bhuvanagiri) జిల్లా సంస్థాన్ నారాయణపురంలోనీ కేజీబీవీలో పలు అభివృద్ధి పనులను రాజగోపాల్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పదవి ఇచ్చినా సైలెంట్‌గా ఉంటానని సీఎం భావిస్తే పొరపాటు అన్నారు. తనకు వారు ఇచ్చే పదవులు.. పైసలు వద్దు అని వ్యాఖ్యలు చేశారు.
ఆలస్యమైన తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR) భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకు వస్తానన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.