అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మరో జల పోరాటానికి సిద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కృష్ణా నది జలాలపై (Krishna River waters) తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తామని హరీశ్‌రావు అన్నారు. కమీషన్ల కోసం కొడంగల్ ప్రాజెక్ట్ (Kodangal project) పేరుతో సొంత జిల్లా ప్రజలకు రేవంత్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సీఎం, మంత్రికి కృష్ణా నీళ్లపై అవగాహన లేదన్నారు. తమ హయాంలో నీళ్ల పంపిణీ చేసేవరకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వకుండా ఆపామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక 40 రోజుల్లోనే KRMBకి అప్పగించారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ఒత్తిడితోనే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారని తెలిపారు.
Harish Rao | 90 టీఎంసీలకు అనుమతులు
పాలమూరు- రంగారెడ్డి డీపీఆర్ జీవో ఇవ్వడానికి కాంగ్రెస్‌కు ఆరేళ్లు పట్టిందన్నారు. తామ హయాంలో ఆ ప్రాజెక్ట్‌కు 90 టీఎంసీలకు అనుమతులు సాధించామని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ 2016లోనే ఒప్పించారన్నారు. కేంద్రమంత్రి, జగన్ సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. పోతిరెడ్డిపాడును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారని చెప్పారు.
Harish Rao | వలసలు వాపస్ వచ్చేలా
నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు 99శాతం పూర్తయ్యాయని హరీశ్‌రావు చెప్పారు. ప్యాకేజ్-2 పనులు పూర్తి చేసి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు. కాలువలు తవ్వేందుకు టెండర్లను రద్దు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. వలసలు వాపస్ వచ్చేలా కేసీఆర్ పాలన సాగిందన్నారు.
Harish Rao | 968 టీఎంసీల నికర జలాలు
కాళేశ్వరంలో 968 టీఎంసీల నికర జలాలు ఉన్నాయని మాజీ మంత్రి చెప్పారు. అందుకే నీటి కేటాయింపుల విషయంలో అనుమతులు వచ్చాయని, ప్రాజెక్టు త్వరగా పూర్తయిందన్నారు. నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్, సీడబ్ల్యుసీ అనుమతులు రావన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపినట్లు రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికీ, KRMBకి ఫిర్యాదు చేశామన్నారు. పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఎన్జీటీలో 2021లో కేసు వేశామని గుర్తు చేశారు. దీంతో ప్రాజెక్ట్‌పై ట్రిబ్యునల్ స్టే విధించిందన్నారు.