అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru Stampede | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru – RCB) 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2025 Indian Premier League – IPL) టైటిల్ విజయం అనంతరం నిర్వహించాల్సిన విజయోత్సవ కార్యక్రమం విషాద పరిణామాలకు దారితీసిన విషయం తెలిసిందే.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తోపులాటలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో మందిని బాధించింది. పోలీసులు, ట్రాఫిక్ అధికారులు అనేకసార్లు సోషల్ మీడియాలో అప్రమత్తం చేస్తూ, ఊరేగింపును నిర్వహించకూడదని, భద్రత చర్యలను పక్కాగా తీసుకోవాలని హెచ్చరించారు. బెంగళూరు (Bengaluru) విధానసౌధం (Vidhana Soudham) నుంచి చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వరకు బహిరంగ బస్సు సర్వీసులను కూడా నిరోధించారు. అయితే వేలాది మంది అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిలాసట జరిగి 11 మంది మృత్యువాత పడ్డారు.
Bengaluru Stampede | మరీ ఇంత నీచులా..
తొక్కిసలాట ఘటనే అవకాశంగా మార్చుకొందరు ఆకతాయిలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఓ వైపు తొక్కిసలాటతో బాధితులు.. ఆర్తనాదాలు.. హాహాకారాలు చేస్తుంటే.. మరికొందరు రాక్షసంగా ప్రవర్తించి, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ నీచంగా ప్రవర్తించారని ఓ వ్యక్తి వీడియోలో తెలియజేశాడు. సదరు వ్యక్తి వీడియోలో మాట్లాడుతూ.. నా స్నేహితుడి కజిన్ ఆర్సీబీ విక్టరీ పరేడ్ RCB victory parade ఈవెంట్ కోసం వెళ్లగా, అక్కడ ఆమెను కొందరు లైంగికంగా వేధించారు. తన బట్టలు చించారు. దొరికిందే ఛాన్స్ అని ఎక్కడబడితే అక్కడ తాకుతూ రాక్షసంగా ప్రవర్తించారు అని విచారం వ్యక్తం చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా, మనుషులు ఎందుకు ఇలా రాక్షసులుగా మారుతున్నారు. కొంచెం కూడా మానవత్వం చూపించడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన చిన్నస్వామి స్టేడియానికి 3 లక్షల మంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం గేట్ నంబర్ 7 వద్ద ఫ్రీ టికెట్లు ఇస్తున్నారనే వదంతి బయటకు రావడంతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారని, ఈ క్రమంలో కొందరు కింద పడినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంత పెద్ద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.