అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RCB vs UP | డబ్ల్యూపీఎల్‌లో భాగంగా వడోదరలోని బీసీఏ స్టేడియం (BCA Stadium)లో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.
వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు క్లిష్టంగా మారే పరిస్థితిలో, స్మృతి మంధాన సేన ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని తమ సత్తా చాటింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో యూపీ వారియర్స్ బ్యాటింగ్‌కు దిగింది. యూపీకి ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్, దీప్తి శర్మ శుభారంభం అందించారు.
RCB vs UP | రెండోసారి ఫైనల్‌కు..
లానింగ్ 30 బంతుల్లో 41 పరుగులు చేయగా, దీప్తి శర్మ (Deepthi Sharma) మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు నడిపింది. తొలి వికెట్‌కు ఈ జోడీ 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీకి కాసేపు ఆందోళన కలిగించింది. అయితే, నడిన్ డి క్లర్క్ కీలక బ్రేక్ ఇచ్చి లానింగ్‌ను పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ దిశ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత యూపీ ఇన్నింగ్స్ క్రమంగా కుప్పకూలింది. దీప్తి శర్మ 43 బంతుల్లో 55 పరుగులతో అర్ధశతకం సాధించి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరో ఎండ్‌లో సహకారం పూర్తిగా కరువైంది. అమీ జోన్స్ (1), హర్లీన్ డియోల్ (14), క్లో ట్రయాన్ (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో యూపీ వేగంగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో యూపీ 143 పరుగులకే పరిమితమైంది.
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. ఆరంభం నుంచే దూకుడుగా వ్యవహరించిన బెంగళూరు బ్యాటింగ్ లైన్ప్, యూపీ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కేవలం 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం నమోదు చేసింది. హ్యారిస్ 75, మంధాన 54 నాటౌట్ రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమన్వయంతో ఆడిన ఆర్సీబీ, ఈ మ్యాచ్‌లో పూర్తిగా పైచేయి సాధించింది. ఇప్పటికే 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు, ఈ విజయంతో ఫైనల్‌కు చేరే మార్గాన్ని మరింత సులభం చేసుకుంది. కీలక దశలో సాధించిన ఈ విజయం ఆర్సీబీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచగా, ఫైనల్లోనూ ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తామని జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా.. ఎలిమినేటర్ విజేతతో ఫిబ్రవరి 5న ఫైనల్లో తలపడనుంది.