IPL 2025
IPL 2025 | టాప్ 2 ఆశ‌లు అడియాశ‌లు.. ఆ స్థానం కోసం ఆర్సీబీ ఏం చేయాలంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుండి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే మిగ‌తా జ‌ట్ల‌కి ఈ జట్టు గ‌ట్టి షాక్ ఇచ్చి వెళ్తోంది.

ఇప్ప‌టికే ల‌క్నోకి ప్లేఆఫ్ ఛాన్స్ లేకుండా చేసిన ఈ జ‌ట్టు ఇప్పుడు ఆర్సీబీ(RCB)ని ఓడించి టాప్ 2 ఆశ‌ల‌పై నీళ్లు చల్లింది. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ (Orange Army) 42 పరుగుల తేడాతో ఆర్‌సీబీ(RCB)ని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 నాటౌట్)‌, అభిషేక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) వీర‌బాదుడు బాద‌డంతో భారీ స్కోరు ల‌భించింది. ఇక భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆర్‌సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్​ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

IPL 2025 | ఆర్‌సీబీకి క‌ష్ట‌మే..

ఈ ఓటమితో ఆర్‌సీబీ RCB టాప్-2లో నిలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌(Points table)లో మూడో స్థానానికి పడిపోయింది. 42 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో రన్‌రేట్(Runrate) బాగా తగ్గింది. దాంతో 17 పాయింట్లు ఉన్నా.. మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది.

త‌మ చివ‌రి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించినా.. టాప్-2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌సీబీ టాప్-2లో నిలవాలంటే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి.

పంజాబ్ కింగ్స్(Punjab kings) తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడాలి. అప్పుడే పంజాబ్ 17, ముంబై 16 పాయింట్లకు పరిమితమవుతాయి. అప్పుడు ఆర్‌సీబీ 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తోంది. ఆఖరి మ్యాచ్ కూడా ఓడితే.. గుజరాత్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్ ఖరారవుతుంది. టాప్ 2 ప్లేస్‌లో నిలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే.. టాప్‌2లో నిలిచిన జ‌ట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 (Qualifier 2) ఆడనుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టాప్-2లో నిలిచిన జట్టుకు ఓడినా మరో అవకాశం లభిస్తుంది. అందుకే జ‌ట్లన్నీ కూడా టాప్ 1, 2ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తాయి.