అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RBI Monetary Policy | ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) బుధవారం వెల్లడించారు. కాగా ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మూడు సార్లు రెపో రేట్లో కోత పెట్టింది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో 25, జూన్‌లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 5.5 శాతంగా ఉంది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ వడ్డీ రేటులో మార్పులు చేయకుండా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
RBI Monetary Policy | అంతర్జాతీయ పరిణామాలతో..
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. దీంతో వడ్డీరేట్లలో కోత ఉంటుందని భావించారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా సుంకాలు (US Tariffs) విధించడంతో వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ వర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
RBI Monetary Policy | తగ్గిన ద్రవ్యోల్బణం
దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలకు మించి తగ్గింది. 2.1శాతం తగ్గి 4 శాతం వద్దే కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.1శాతానికి తగ్గొచ్చని ఆర్‌బీఐ అంచాన వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున.. ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం సైతం దిగి రానుంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితి (International Uncertainty) నేపథ్యంలో ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరించింది.
RBI Monetary Policy | పెరిగిన ఫారెక్స్ నిల్వలు
ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జులై 25తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 698.19 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 11 నెలల గరిష్ట స్థాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా తెలిపింది. స్థిరమైన వస్తువుల ఎగుమతులతో ఈ పెరుగుదల సాధ్యమైందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రవేశ పెట్టిన జన్‌ధన్ పథకానికి పదేళ్లు పూర్తవుతున్నాయి. దీంతో బ్యాంకులు సెప్టెంబర్ వరకు పంచాయతీ స్థాయి నుంచి రీ-KYC కోసం శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తలు కొనసాగుతుండడంతో జీడీపీ వృద్ధిపై ఆందోళనలు నెలకొని ఉన్నాయి.