అక్షరటుడే, వెబ్డెస్క్ : RBI | ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జీరో బ్యాంక్ ఖాతాదారులకు పలు సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (Basic Savings Bank Deposit) ఖాతాలకు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking) సౌకర్యం అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఏటీఎం, సీడీఎం మిషన్లలో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించనున్నారు. అలాగే మరికొన్ని సేవలను ఉచితంగా అందించాలని బ్యాంకులకు ఆర్బీఐ(RBI) సూచించింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) వెల్లడించారు. సహకార బ్యాంకులను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వస్తామన్నారు. జీరో బ్యాలెన్స్ ఖాతా ఉన్న వారు ఆ బ్యాంకులో మరే పొదుపు ఖాతా తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు.
RBI | వడ్డీ రేట్లు యథాతథం
ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.5 శాతం వద్ద ఉంది. కాగా రెపో రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా రెండవసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యావసర వస్తువులపై విధించిన అదనపు సుంకాల తర్వాత ఇది కీలకమైన సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆహార ధరల సడలింపు, అనుకూలమైన బేస్ ప్రభావం ద్వారా ఆగస్టులో ఇది ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయి 2.07 శాతానికి తగ్గిందని వెల్లడించారు.