అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reserve Bank of India | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలకమైన వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ (Central Bank) ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఈనెల 4 న ప్రారంభమై 6న ముగిసింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ చివరి విధాన సమీక్ష సమావేశం ఇది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Governor Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నామని ప్రకటించారు.
ఏడాదిలో 1.25 బేసిస్ పాయింట్లు తగ్గింపు
గతేడాది ఆర్బీఐ కీలకమైన వడ్డీ రేట్లను పలుమార్లు తగ్గించిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన కేంద్ర బ్యాంక్ (Central Bank).. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. డిసెంబరులో మరో పావు శాతం తగ్గించింది. అంటే గతేడాది ఫిబ్రవరినుంచి డిసెంబర్ వరకు 1.25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గాయన్న మాట. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్లో వందో వంతుకు సమానం.
ఆర్బీఐ మీటింగ్‌కు సంబంధించిన కీలక అంశాలు..
- ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగుపడటం, అసంఘటిత రంగంలో స్థిరమైన వృద్ధి తయారీకి ఊతమివ్వనుంది.
- యూరోపియన్ యూనియన్ (European Union), యూఎస్‌లతో ట్రేడ్ డీల్స్ వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో 6.9 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2026 -27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావొచ్చు.
- జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత రోజువారీ సగటున రూ. 75 వేల కోట్లుగా ఉంది.