అక్షరటుడే, వెబ్‌డెస్క్: RBI Governor | ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Chief Minister Revanth Reddy) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణల గురించి ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించారు. మూడవ డిస్కం ఏర్పాటు ప్రతిపాదనతో సహా విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించారు.
RBI Governor | బడ్స్ చట్టాన్ని నోటిఫై చేయాలి
బడ్స్ చట్టాన్ని (BUDS Act) నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ ముఖ్యమంత్రిని కోరారు. బడ్స్ చట్టం అంటే.. ప్రజలను మోసం చేసి డిపాజిట్లు సేకరించే సంస్థలపై నిషేధం విధించడం కోసం రూపొందించిన చట్టం. రాష్ట్రం మరిన్ని సంస్కరణలు, అభివృద్ధి ఆధారిత కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆర్బీఐ గవర్నర్ ఆకాంక్షించారు. సంజయ్ మల్హోత్రా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI)కి సంబంధించి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవడంపై ఆర్బీఐ చేపట్టిన ప్రచారం గురించి తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్బీఐ హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, జనరల్ మేనేజర్లు మేజర్ యశ్పాల్ చరణ్, పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.