అక్షరటుడే, వెబ్‌డెస్క్: BCCI | ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత వన్డే జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కి రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండగా, ఇటీవల 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) విజేతలైన రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలను (Mohammed Shami) వన్డే జట్టులోకి ఎంపిక చేయలేదు.
దాంతో ఈ ఇద్దరి వన్డే కెరీర్ (ODI Career) ముగిసిందా? అనే చర్చలకు తెరలేచింది. 35 ఏళ్ల మహ్మద్ షమీ చివరిసారిగా భారత జట్టులో వన్డే మ్యాచ్‌ను 2025 మార్చిలో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఆపై గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో దూరమయ్యాడు. IPL 2025 సీజన్‌లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దులీప్ ట్రోఫీలో కేవలం ఒక వికెట్ మాత్రమే సాధించాడు.
ఈ నేపథ్యంలో షమిని వన్డే జట్టులోకి తీసుకోకపోవడం అర్థవంతమేనని సెలక్షన్ కమిటీ భావించింది. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే, షమీ వన్డేల్లో తిరిగి ఆడే అవకాశాలు మరింత కష్టంగా మారేలా కనిపిస్తున్నాయి. గతానికి వస్తే, షమీ భారత్ తరఫున ఇప్పటివరకు 108 వన్డేలు ఆడి, 206 వికెట్లు తీసాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup) అత్యుత్తమంగా రాణించిన బౌలర్లలో షమీ ముందు వరుసలో ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఆయన కెరీర్ చివరి దశలో ఉంది.
ఇక ఇక రవీంద్ర జడేజా విషయానికి వస్తే, ఇటీవలే టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన టెస్ట్ క్రికెట్‌లో సత్తాచాటుతున్నాడు. అయితే, వన్డే జట్టులోకి ఎంపిక కాలేదు. దీనిపై ముఖ్య సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ, ‘‘జడేజా (Jadeja) మా ఆలోచనల్లో ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనకు ఇప్పటికే అక్షర్ పటేల్ వంటి ఎడమచేతి స్పిన్నర్ ఉన్నాడు. అందుకే ఇద్దరు ఎల్ఎఫ్ స్పిన్నర్ల అవసరం లేకపోయింది,’’ అని తెలిపారు.
36 ఏళ్ల జడేజా, భారత్ తరఫున 204 వన్డేల్లో 231 వికెట్లు తీసాడు. బ్యాటుతో 2,806 పరుగులు, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో ఒక అసలైన ఆల్‌రౌండర్‌గా చక్కటి స్థానం సంపాదించుకున్న జడేజా, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడి, తర్వాత రిటైర్ కావాలని భావిస్తున్నట్టు సమాచారం.
BCCI | ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ