అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ravi Teja | టాలీవుడ్లో ‘మాస్ మహారాజా’ అనే బ్రాండ్‌ను తనకంటూ బలంగా నిలబెట్టుకున్న హీరో రవితేజ (Hero Ravi Teja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా, అదే ఎనర్జీ, అదే జోష్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన స్టైల్.
గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ, రవితేజ ఆత్మవిశ్వాసంలో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. అలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఆయనకు కాస్త ఊరటనిచ్చే విజయంగా నిలిచింది. ఈ చిత్రంతో రవితేజ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మరోసారి నిరూపించడంతో పాటు, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన కలెక్షన్లు సాధించారు.
Ravi Teja | కొత్త ప్రయత్నం
ఈ విజయంతో ఉత్సాహం పొందిన రవితేజ ఇప్పుడు తన తదుపరి సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. తన కెరీర్లో 77వ చిత్రంగా రూపొందుతున్న RT-77కి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, టైటిల్‌ను కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ (Irumudi) అనే పవర్ఫుల్, భావోద్వేగభరితమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) ఆశీర్వాదాలతో మొదలయ్యే ఒక విముక్తి ప్రయాణమే ఈ కథ థీమ్ అని పోస్టర్ స్పష్టంగా చెప్పేస్తోంది.
అయ్యప్పమాలలో ఉన్న రవితేజ, ఒక చేత్తో నెత్తిమీద ఇరుముడిని మోస్తూ, మరో చేత్తో ఓ చిన్న పాపను ఎత్తుకున్న లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లుక్‌లో రవితేజ ఇప్పటివరకు కనిపించని విధంగా సీరియస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘EVERY EMOTION IS A CELEBRATION’ అనే ట్యాగ్‌లైన్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఈ సినిమాకు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి ఎమోషనల్ హిట్స్ అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గత చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఈసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో శివ నిర్వాణ ‘ఇరుముడి’ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇది సాధారణ కథ కాకుండా, ఒక పవర్ఫుల్ యాక్షన్–రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. ముఖ్యంగా ఇందులో రవితేజ ఒక బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది.
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కోలీవుడ్ స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు. హీరోయిన్గా ప్రియా భవాని శంకర్ (Heroine Priya Bhavani Shankar) నటిస్తుండగా, తండ్రి–కూతురు సెంటిమెంట్ కథకు గట్టి భావోద్వేగ బలాన్ని ఇవ్వనుంది. ముందుగా ప్రకటించినట్లుగానే, జనవరి 26న ఉదయం 10 గంటలకు టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసి మేకర్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.