అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | హైదరాబాద్ (Hyderabad)లో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. రేవ్‌పార్టీలు, బర్త్ డే పార్టీల పేరిట యథేచ్ఛగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఇటీవల ఈగల్ టీమ్ (Eagle Team) కేసులు నమోదు చేస్తున్న డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి రేవ్‌పార్టీ భగ్నం చేశారు.
నగరంలోని గచ్చిబౌలి (Gachibowli)లో గల రాజేశ్వరి నిలయం అనే అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఇందులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ కూడా ఉండడం గమనార్హం. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలిసింది. యువతులను డ్రగ్స్ పార్టీ కోసం బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Eagle Team | పార్టీల ఏర్పాటు
రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అనంతరం ఆయన కూడా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. హైదరాబాద్, గోవా (Goa) వంటి ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలోని రిసార్టుల్లో సైతం డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
Eagle Team | పరారీలో ఇద్దరు
మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండీఎంఏ, 20 డ్రగ్స్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితుల్లో పలువురికి మల్నాడు డ్రగ్స్ కేసు (Malnadu Drugs Case) తో సంబంధం ఉన్నట్లు సమాచారం. డ్రగ్ ఫెడ్లర్లు విక్రమ్, తేజ, ముగ్గురు వినియోగదారులు పురుషోత్తం, నీలిమ, భార్గవ్‌ను, డ్రగ్స్ రవాణా చేసే చందన్‌ను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.