అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rashmika Mandanna | ‘ఛలో’ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందానా . పుష్ప 2, యానిమల్, ఛావా చిత్రాలు బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ అమ్మడి పేరు పాన్ రేంజులో మార్మోగిపోయింది.
ఇప్పటికీ చేతిలో అరడజను చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు రష్మికతో ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులలోనే విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్ కావడంతో కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఐరన్ లెగ్ అంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు కర్ణాటక(Karnataka)కి చెందిన రష్మిక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టిన కాంతార చాప్టర్ 1 సినిమాపై ఇంకా స్పందించకపోవడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rashmika Mandanna | “నన్ను ఎవరూ నిషేధించలేదు”
ఎంత ఎదిగిన కూడా మూలాలు మరిచిపోకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడూ తన భాషని, ప్రాంతాన్ని మరిచిపోయినట్టు ప్రవర్తిస్తుంటావు, నీకు బతుకునిచ్చిన కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry)ని మరిచిపోయి నువ్వు చాలా తప్పు చేస్తున్నావ్.. నీ స్టార్డమ్ తగ్గిపోయాక మళ్లీ నిన్ను ఆదుకునేది, ఆదరించేది సొంత రాష్ట్రమే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తనపై కొన్ని రోజులుగా జరుగుతున్న పుకార్లపై రష్మిక(Rashmika Mandanna) చివరికి స్పందించారు. ప్రత్యేకించి కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న ప్రచారంపై ఆమె పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. తన రాబోయే చిత్రం ‘థామా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై రష్మిక ఓపికగా మాట్లాడారు.
నన్ను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు అని రష్మిక తేల్చి చెప్పారు. “కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇటువంటి పుకార్లు వస్తుంటాయి. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి తన పని చేసుకుంటూ పోవాలన్నదే తన నమ్మకం అని రష్మిక చెప్పుకొచ్చారు. “ఇతరుల కోసం మనం జీవించకూడదు” అని సూటిగా తెలిపారు. ఇక గతంలో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ ‘కాంతార’పై రష్మిక స్పందించలేదని వచ్చిన విమర్శలపైనా ఆమె వివరణ ఇచ్చారు. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే నేను చూడలేను. ‘కాంతార'(Kantara Movie) కూడా కొన్నిరోజుల తర్వాతే చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ మెసేజ్ చేశాను. వారు కూడా నాకు ధన్యవాదాలు తెలిపారు” అని రష్మిక తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడంతో కొంతమంది అపార్థాలకు గురవుతారని రష్మిక అభిప్రాయపడ్డారు. ప్రతీ విషయాన్ని కెమెరా ముందు పెట్టలేం కదా. నేను ఆన్లైన్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు షేర్ చేయను. అందుకే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రేక్షకులు నా నటన గురించి ఏమంటారనే అంశమే నాకు ముఖ్యం అని స్పష్టంగా చెప్పారు. రష్మిక ప్రస్తుతం పలు భాషల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో విడుదలకానున్న ‘థామా’ చిత్రంతో పాటు, పలు సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.