అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అరుదైన కలయిక జరగడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇరుజట్ల ఆటగాళ్ల కోచ్‌లు, కెప్టెన్లు కలిసి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడారు. టీమిండియా కెప్టెన్ గిల్ (Team India Captain Gill), మాంచెస్టర్ యునైటెడ్ జట్టు సారథి బ్రూనో ఫెర్నాండెజ్(Captain Bruno Fernandes)తో పాటు ఆటగాళ్లందరూ ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకొని ఫొటోలకు పోజులివ్వడంతో ఆ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. భారత క్రికెట్ జట్టు, ప్రీమియర్ లీగ్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఒకే వేదికపై కలుసుకున్నాయి. ఈ ప్రత్యేక వేడుకను వారి ఉమ్మడి స్పాన్సర్ అయిన అడిడాస్ (Adidas) ఉత్సాహభరితంగా నిర్వహించింది.
Team India | అరుదైన క్షణం..
జూలై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం(Old Trafford Ground)లో జరగనున్న భారత-ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ మ్యాచ్‌కు ముందు, ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్(Cricket), ఫుట్‌బాల్(Football) ప్రపంచాల్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు అరుదైన సమయాన్ని గడిపారు. ఫొటోషూట్లు, సరదా సంభాషణలు, చిన్నపాటి స్నేహపూర్వక ఆటలతో ఈ కార్యక్రమం స్పోర్ట్స్ సెలబ్రేషన్‌లా మారింది. ఈ ఈవెంట్‌లో ప్రధాన హైలైట్ ఏంటంటే.. భారత క్రికెట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరియు మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ (Manchester United Captain) బ్రూనో ఫెర్నాండెజ్ జెర్సీలు మార్చుకుని దిగిన ఫోటోలు. వీటితో పాటు, ఇతర ఆటగాళ్లు కూడా ఒకరి జెర్సీలు మరొకరు ధరించి ఆట స్పూర్తిని చాటారు. ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.
మరోవైపు, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కొన్ని బంతులు వేయగా, యునైటెడ్ డిఫెండర్ హ్యారీ మాగ్వైర్ బ్యాట్ పట్టుకుని సరదాగా బ్యాటింగ్ చేశాడు. ఇక రిషబ్ పంత్ తన ఫుట్‌బాల్ నైపుణ్యాలతో మెరిశాడు. యునైటెడ్ గోల్‌కీపర్ టామ్ హీటన్‌ను ఎదుర్కొంటూ పెనాల్టీ కిక్స్ వేయడం అభిమానులకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు యునైటెడ్ క్యాంప్‌ను సందర్శించి జెర్సీలపై సంతకాలు చేయడం, ఫోటోలకు ఫోజులివ్వడం, యునైటెడ్ కోచింగ్ సిబ్బందితో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.