అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rapido | రైడ్ హెయిలింగ్ యూనికార్న్ అయిన ర్యాపిడో(Rapido) ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించింది. స్విగ్గీ, జొమాటో(Zomato)లకు గట్టి పోటీ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తోంది. పోటీ కంపెనీలతో పోల్చితే అతి తక్కువ డెలివరీ ఫీజు వసూలు చేస్తున్న ర్యాపిడో.. ఎలాంటి ఫ్లాట్‌ఫాం, ప్యాకేజింగ్ ఫీజులు వసూలు చేయడం లేదు. పోటీ సంస్థలతో పోల్చితే తక్కువ చార్జీలతో ఫుడ్ డెలివరీ(Food delivery) చేస్తుండడంతో దీనికి ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ర్యాపిడో తన కొత్త ఫ్లాట్‌ఫాం అయిన ‘ఓన్లీ’(Only)తో ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టింది. బెంగళూరు(Bengalore)లో పైలట్ ప్రాజెక్టుగా సేవలను ప్రారంభించింది. తక్కువ కమీషన్(Low commission), జీరో ఫ్లాట్‌ఫాం ఫీజుతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా.. ర్యాపిడో మాత్రం 8 నుంచి 15 శాతమే వసూలు చేయనున్నట్లు తెలిపింది. అలాగే రెస్టారెంట్ భాగస్వాములనుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయడం లేదు. జొమాటో, స్విగ్గీ(Swiggy)లతో విధించే ఫ్లాట్‌ఫాం, ప్యాకేజింగ్ ఖర్చులనూ ర్యాపిడో వసూలు చేయడం లేదు. వంద రూపాయలలోపు ఆర్డర్‌లకు రూ. 10, వంద రూపాయలకంటే ఎక్కువ విలువగల ఆర్డర్(Order)లకు రూ. 25 డెలివరీ ఫీజు వసూలు చేస్తోంది. దీంతో తక్కువ ధరకే వినియోగదారులకు ఫుడ్ లభిస్తోంది.
ఉదాహరణకు బెంగళూరులో మెక్ చికెన్(McChicken) బేస్ ధర రూ. 199 గా ఉంది. ఫ్లాట్‌ఫాం ఫీ, డెలివరీ చార్జ్, ప్యాకేజింగ్ కాస్ట్, జీఎస్టీ(GST)తో కలిపి దీనిని స్విగ్గీ రూ. 451కి, జొమాటో రూ. 402కు డెలివరీ చేస్తుండగా.. ర్యాపిడో ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం అయిన ఓన్లీ మాత్రం రూ. 234కే డెలివరీ చేస్తోంది. స్విగ్గీతో పోల్చితే 48 శాతం, జొమాటోతో పోల్చితే 42 శాతం తక్కువకే ర్యాపిడో మెక్ చికెన్‌ను కస్టమర్(Customer)కు అందిస్తుండడం గమనార్హం. తక్కువ డెలివరీ ఫీజు(Delivery fee), జీరో కమిషన్ మోడల్ వల్ల తక్కువ ధరకు అందించగలుగుతోంది. అయితే ఇలా ఎంతకాలం తక్కువ ధరకు అందించగలదో వేచి చూడాలి. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే ర్యాపిడో ఓన్లీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాలకు విస్తరించడం, నెట్‌వర్క్ పెంచుకోవడం, డెలివరీలో వేగం, అందించే ఆఫర్లు తదితర అంశాలపై ర్యాపిడో ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికీ స్విగ్గీ, జొమాటోలు ఈ రంగంలో వేగవంతమైన, నమ్మదగిన సేవలు అందిస్తున్నాయి. ఇవి వసూలు చేస్తున్న అధిక ఫీజుల కారణంగా కస్టమర్లు ర్యాపిడో ఓన్లీ వైపు మళ్లే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.