అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ (Machareddy Police Station) పరిధిలో కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మాచారెడ్డిలో వరుసకు నానమ్మ అయిన వాళ్లింటికి సెలవుల సమయంలో వచ్చేది.
అప్పుడప్పుడు కేజీబీవీ నుంచి వచ్చి రాత్రి సమయంలో అక్కడే నిద్రించేది. దసరా సెలవుల (Dussehra Holidays) సమయంలో వచ్చిన బాలిక ఎప్పటిలాగే రాత్రి నిద్రిస్తుండగా.. పక్కింట్లో ఉండే భూక్య గణేష్ వచ్చి బాలికను అరిస్తే చంపేస్తా అని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టాడు. దాంతో విషయం దాచిపెట్టిన బాలిక పాఠశాలకు వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురైంది.
ఆ సమయంలో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా 2018 జనవరి 13న మాచారెడ్డి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో కేసు (POCSO Case) నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసులో శిక్ష పడుతుందని భావించిన నిందితుడు గణేష్ విదేశాలకు పారిపోగా.. ఇక్కడకు రప్పించి కోర్టులో హాజరుపర్చారు. కోర్టులో పోలీసులు సాక్షాధారాలు సమర్పించగా నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా సాక్షాలు కోర్టులో సమర్పించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అభినందించారు.

