అక్షరటుడే, వెబ్డెస్క్: Greater Hyderabad | రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచింది. సమీపంలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ (GHMC)లో విలీనం చేసింది. వార్డులు, జోన్ల సంఖ్యను రెట్టింపు చేసింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate)లలో కూడా మార్పులు చేసింది. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషరేట్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డిని రెండు జిల్లాలుగా మార్చడంతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లా సరిహద్దులు సైతం మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని చూస్తోంది.
Greater Hyderabad | కమిషనరేట్లు పెరగడంతో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి వరకు మూడు పోలీసు కమిషరేట్లు ఉండేవి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉండగా.. మూడు జిల్లాలు ఉండేవి. మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి గ్రేటర్ పరిధిలో ఉండేవి. అయితే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కమిషరేట్ ఏర్పాటుతో మరో జిల్లాను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి హద్దులను సైతం మార్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Greater Hyderabad | మార్పులు, చేర్పులు
హైదరాబాద్ జిల్లాలో పలు మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం 16 మండలాలు ఉండగా.. మారేడ్పల్లి, తిరుమలగిరిన మల్కాజ్గిరి జిల్లా (Malkajgiri District)లోకి మార్చనున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్, సరూర్నగర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) పెద్దదిగా ఉంది. ఈ జిల్లాలో అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రంగారెడ్డిని అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించనున్నట్లు సమాచారం. అర్బన్ జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలోకి, రూరల్ జిల్లా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డిని రెండుగా విభజిస్తే ఆ సంఖ్య 34 కు చేరనుంది.