అక్షరటుడే, వెబ్‌డెస్క్: Digital Arrest | పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ డి.రామస్వామి (77) సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయారు. ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో బెదిరింపులకు పాల్పడిన కేటుగాళ్లు ఆయన నుంచి ఏకంగా రూ.57 లక్షలను కాజేశారు.
ఈ డబ్బును విదేశాలకు తరలించి క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు చెన్నై సైబర్ క్రైం పోలీసులు (Cybercrime Police) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. లెదర్ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామస్వామి, గతంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. దేశానికి అందించిన విశేష సేవలకు గాను ఆయనకు 2001లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తూ ఒక ప్రముఖ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Digital Arrest | తెలివైన మోసం..
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రామస్వామిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు (Cyber Fraud) , అధికారులమని నటిస్తూ ‘డిజిటల్ అరెస్టు’ అంటూ బెదిరింపులకు దిగారు. చట్టపరమైన ఇబ్బందులు తప్పించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిందేనంటూ భయపెట్టి.. విడతల వారీగా మొత్తం రూ.57 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన రామస్వామి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామస్వామికి వచ్చిన వాట్సప్ కాల్స్ (WhatsApp Calls) కాంబోడియా నుంచి వచ్చినట్లు టెక్నికల్ అనాలిసిస్లో తేలింది. మోసగాళ్లు డబ్బును తమ ఖాతాల్లో జమ అయిన వెంటనే ఏజెంట్ల ద్వారా చెక్కుల రూపంలో విత్‌డ్రా చేయించి, అనంతరం విదేశాలకు తరలించి క్రిప్టో కరెన్సీలోకి (Crypto Currency) మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సైబర్ ముఠా ప్రమేయం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు లేదా ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) వంటి బెదిరింపులు వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సంబంధిత సైబర్ క్రైం వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు