అక్షరటుడే, కామారెడ్డి: Rakesh Reddy Comments | ‘తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు ఓడిపోయినవ్.. నేనైతే బావిలో పడిచచ్చిపోయేటోడిని.. దయచేసి దేశం విడిచి వెళ్లిపో షబ్బీర్ అలీ.. నీకు సౌదీ వీసా కావాలంటే నేను మాట్లాడి ఇప్పిస్తా’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై (government advisor Shabbir Ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. షబ్బీర్ అలీ వెనక రోహింగ్య ముస్లింలు ఉన్నారని, ఆయన వెంట బంగ్లాదేశ్ ఆక్రమణదారులు ఉన్నారని ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని(MLA KVR) మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Rakesh Reddy Comments | సీబీఐతో విచారణ చేయించాలి
షబ్బీర్‌అలీ వెనక ఉన్న రోహింగ్యాల విషయమై సీబీఐతో విచారణ జరిపి ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఆయనను రాజమండ్రి జైలుకు పంపించాలని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పైనా పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి అన్యాయం, అక్రమం, దారుణమని, రేవంత్ రెడ్డి సీఎం అయినా గుణం మారలేదన్నారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా చేరినట్టుగా లేదని విమర్శించారు.
రెండేళ్లుగా సీఎం కామారెడ్డికి ఏమిచ్చారు..
రెండేళ్లుగా కామారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఏమిచ్చారని.. కొడంగల్‌కు ఏమి తీసుకెళ్లారని రాకేష్‌రెడ్డి నిలదీశారు. కామారెడ్డి, కొడంగల్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోయిన వ్యక్తి, తలమీద అర్ధ రూపాయి పెడితే అమ్ముడు పోని షబ్బీర్ అలీని ముందు పెట్టుకుని రెండేళ్లుగా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడానికి ఎంత ధైర్యమని, ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. రమణారెడ్డి సౌమ్యుడేమో.. తాను కాదని, కన్నుకు కన్ను, కత్తికి కత్తి, పనుకు పన్ను, ఆయుధానికి ఆయుధమే సమధానమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా.. ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోండన్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనే తమకు పోటీ అని.. ఆయనను ఓడించి సమాన స్థాయిలో ఉన్నామన్నారు. ఈ గొడవకు సీఎం రేవంత్ రెడ్డే ప్రధాన కర్త అని విమర్శించారు. సీఎంను ఓడించాడని కడుపులో విషం పెట్టుకున్నారని, కళ్లల్లో కారం పోసుకుంటున్నారన్నారు. ఇద్దరు సీఎంలను ఓడించిన రమణారెడ్డికి దేశంలోనే గుర్తింపు వచ్చిందని కితాబునిచ్చారు.
కామారెడ్డి నేలను చూసి..
కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుందని రాకేష్‌రెడ్డి అన్నారు. ‘పోలీసులకు కూడా చెబుతున్నాం.. ఈ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుంది. పదేండ్లు అధికారంలో ఉన్నోళ్లు ఫార్మ్ హౌస్‌లో పండుకున్నరు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా అంతే.. తర్వాత వచ్చేది అధికారంలోకి మేమే. ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేశారని తెలిసింది. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే బీజేపీ కార్యకర్తల కోపాన్ని తట్టుకోలేరని రాకేష్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న కోట్లాది బీజేపీ కార్యకర్తలు కామారెడ్డిలో కవాతు చేస్తారని తెలిపారు. ఇంకా అక్రమ కేసులు ఎవరి మీదైన పెడితే దానికి సరైన పరిహారం పోలీసు వ్యవస్థ చెల్లించాల్సి వస్తుందన్నారు.
సీతక్కపై ఫైర్..
మంత్రి సీతక్కపై కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ఏం తప్పు మాట్లాడినం సీతక్క మేము.. సమసమాజం అన్నావ్, అడవులకు వెళ్లి నక్సలిజం అన్నావ్.. గన్నులు వదిలి పెన్నులు పట్టినవ్.. రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సభలు పెడతారా.. శంకుస్థాపనలు చేస్తారా.. అని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అన్ని శాఖలు ఉన్నాయని, ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఆయనతో పాటు తాను కూడా స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు.
సీఎం మీద 169 కేసులున్నాయ్..
తమ మీద ఓటుకు నోటు కేసు కాలేదని, సీఎం మీద 169 కేసులు ఉన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇయ్యుమంటే నన్ను కోసుకోండి అన్నారని, ఇవాళ కొడంగల్‌కు రూ.5 వేల కోట్లు ఎలా వస్తున్నాయని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు రూ.1000 కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. బాన్సువాడ, కామారెడ్డి, పాతబస్తీ, నిజామాబాద్ ఘటనలతో చేతకాని ప్రభుత్వంగా మిగిలిపోయిందన్నారు.
మెజారిటీ హిందూ ప్రజలను అవమానించే ప్రభుత్వమని విమర్శించారు. మతం మారిన సీఎం.. రేవంత్ ఉద్దీన్ అని అంటాడా.. ఆయనకు ఎటువంటి పరిపాలన విలువలున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కదా.. ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరేనా ఆయన కుటుంబం మొత్తం మతం మారిందా అని ప్రశ్నించారు. అల్లుడిని అబ్దుల్లాను ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. ఎన్నిరోజులు ప్రజలను మోసం చేస్తారని, కామారెడ్డిలో ఓడిపోయానని సీఎం క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాడన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
